- అరబ్ పార్టీలను దూరం పెట్టాలని లికుడ్ పార్టీ షరతు
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు చేపట్టిన యషర్ పార్టీ చీఫ్ గాడీ ఐసెన్‌కోట్ కీలక అడుగు వేశారు. సంకీర్ణ చర్చల కోసం ఆపద్ధర్మ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీని ఆహ్వానించారు. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఐసెన్‌కోట్‌కు వచ్చే నెల వరకు గడువు ఉంది.
వీలైనంత విస్తృత స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఆదివారం నుంచి లికుడ్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరపనున్నట్టు యాషర్ పార్టీ శనివారం ప్రకటించింది. అయితే, అల్ట్రా-ఆర్థోడాక్స్ పార్టీలు, అరబ్ పార్టీలు లేదా నెతన్యాహు కూటమిలో ఎవరితో కలవాలనే దానిపై ఐసెన్‌కోట్ శిబిరంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఐసెన్‌కోట్ నేతృత్వంలో జియోనిస్ట్ ఐక్య ప్రభుత్వాన్ని కోరుకుంటున్నప్పటికీ, నెతన్యాహు కూటమితో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోమని తేల్చిచెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటుకు లికుడ్ పార్టీ షరతులు
దేశ భద్రత దృష్ట్యా జాతీయ ఐక్య ప్రభుత్వం అవసరమని నెతన్యాహు గట్టిగా వాదిస్తున్నారు. గతంలో నెతన్యాహు నాయకత్వంలోని ప్రభుత్వంలో పనిచేయబోనని తేల్చిచెప్పిన ఐసెన్‌కోట్, లికుడ్ పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐసెన్‌కోట్ ఆహ్వానం వెలువడిన కొద్దిసేపటికే లికుడ్ పార్టీ తమ షరతులను వెల్లడించింది.
నెతన్యాహుపై, ప్రభుత్వంపై వ్యక్తిగత దాడులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు రాజకీయ బహిష్కరణలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే, ఇజ్రాయెల్‌ను యూదు ప్రజల జాతీయ రాజ్యంగా గుర్తించే పార్టీలతో కలిసి, అరబ్ పార్టీల ప్రమేయం లేకుండా ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడి ప్రకటన చేయాలని కోరింది.
